సినీ దునియా రేటింగ్ : 3/5
దర్శకత్వం : తిరు
నిర్మాత : విశాల్ కృష్ణ
సంగీతం : జీ.వి.ప్రకాష్
నటీనటులు : విశాల్, లక్ష్మీ మీనన్ ...
‘ధీరుడు’ తరువాత హీరో విశాల్ స్వీయ నిర్మాణంలో వచ్చిన మరో సినిమా ‘ఇంద్రుడు’. తిరు దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘నాన్ సిగపు మనిదన్’ అనే తమిళ్ సినిమాకి డబ్బింగ్. విశాల్, లక్ష్మీ మీనన్ హీరో హీరోయిన్ లుగా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
కథ:
ఇంద్ర (విశాల) నార్కో లేప్సీ అనే ఒక స్లీపింగ్ డిసార్డర్ తో భాదపడుతూ ఉంటాడు. ఆనందం వచ్చిన, భయం వేసిన, ఆశ్చర్యం, ఇలా ఏ ఎమోషన్ కి గురైనా అక్కడికక్కడే నిద్ర పోవడం దీని లక్షణం. అయితే ఈ వ్యాధి కారణంగా ఇంద్ర ఏ పని ఒంటరిగా చేయలేడు, అతనికి ఉద్యోగం కూడా ఎవరూ ఇవ్వరు. ఇలాంటి పరిస్థితులలోనే మీరా (లక్ష్మీ మీనన్) అనే ఓ గొప్పింటి అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది.
ఈ వ్యాధి వలన ఇంద్ర ఒంటరిగా చేయలేని కొన్ని కోరికలను మీరా సహాయంతో ఆ కోరికలను తీర్చుకుంటాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ ఏర్పడుతుంది. మీరా తండ్రి వారి పెళ్ళికి ఒప్పుకోనప్పటికి వారు అతనిని ఒప్పించి పెళ్ళికి సిద్దం అవుతారు. అయితే ఇలాంటి సమయంలోనే అనుకోకుండా ఒక రోజు మీరా మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. ఆ ఘటన వల్ల మీరా కోమాలోకి వెళ్ళిపోతుంది. అసలు మీరా మీద హత్యాప్రయత్నం చేసింది ఎవరు, ఆమెను ఎందుకు చంపాలనుకున్నారు? ఒంటరిగా ఏ పనిని చేయలేని ఇంద్ర తన పగను ఎలా తీర్చుకున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే, సినిమా చూడాల్సిందే…
ప్లస్ పాయింట్స్:
విశాల తనదైన శైలిలో మంచి నటన కనబరిచాడు. సహజంగా ఇలాంటి వ్యాధితో భాధపడే క్యారెక్టర్ చేయడం అంత సులభం ఏమి కాదు, కానీ విశాల్ తన పాత్రకు ప్రాణం పోసాడు. ఉన్నట్టుండి నిలుచున్నచోటే కుప్పకూలి నిద్రలోకి జారుకోవడం లాంటి సన్నివేశాలను చాలా సహజంగా చేసాడు. ఇక హీరోయిన్ లక్ష్మీ మీనన్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. తనపై దాడి జరిగే సన్నివేశంలో ఆమె నటన చాలా బాగుంది.
ఇంద్ర తల్లిగా నటించిన శరణ్య తన పాత్రకు న్యాయం చేసింది. ఆ పాత్రలోని ఎమోషన్ మరియు చిలిపితనాన్ని బాగా పండించారు. జీ.వి.ప్రకాష్ అందించిన సంగీతం కూడా సినిమాకి ప్లస్ అనే చెప్పుకోవాలి. స్క్రీన్ ప్లే సినిమాకి పెద్ద హై లైట్. ఫస్ట్ హాఫ్ లో హీరో వ్యాధితో బాధపడే ఇబ్బందులు, అలాగే సెకండ్ హాఫ్ లో తను పగ తీర్చుకునే విధానం బావుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ బాగుంది. ఉన్న కొంత మంది నటులే అయినా కూడా మంచి నటనతో సినిమాని నడిపించారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో పెద్దగా చెప్పుకోదగిన మైనస్ పాయింట్స్ అంటే ఫస్ట్ హాఫ్ లో కంటిన్యూగా అతని జబ్బుని హైలైట్ చేస్తూ చేసిన సీన్స్ ఎక్కువయ్యాయి అనిపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కాస్త బోర్ కొట్టిస్తుంది. సినిమాకి అది ముఖ్యమైనప్పటికీ దానిని సాగదీసినట్టుగా ఉంటుంది. 
సాంకేతిక విభాగం:
సినిమాలో పాటలు బాగున్నాయి. జీ.వి. ప్రకాష్ అందించిన రీ రికార్డింగ్ కూడా బాగుంది. రిచర్డ్ సినిమాటోగ్రఫి కూడా చాలా బాగుంది. అన్ని సీన్స్ ని చాలా సహజంగా ఉంటాయి. ఇక సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది  డైరెక్టర్ తిరు గురించి. స్లీపింగ్ డిసార్డర్ అనే ఒక చిన్న పాయింట్ తో స్టొరీని ఆసక్తిగా నడిపించాడు. దానికి తోడు అద్భుతమైన స్క్రీన్ ప్లేని రాసుకొని, సినిమా ఎక్కడ స్లోగా ఉండకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. హీరో హీరోయిన్ ల నుండి అద్భుతమైన నటనను రాబట్టుకున్నాడు.
తీర్పు:
నార్కో లెప్సీ అనే వ్యాధిని కాన్సెప్ట్ గా తీసుకొని చేసిన ‘ఇంద్రుడు’ సినిమాలో విశాల్ నిద్రపోతాడు కానీ ఆడియన్స్ మాత్రం ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతుంటారు. సినిమాలో విశాల్ మినహా మిగతా నటీనటులు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియనపటికీ, ఒక మంచి థ్రిల్లర్ సినిమా చూడాలనుకునే వారికి ఈ సినిమా నిరుత్సాహపరచదు.

0 comments:

Post a Comment

 
Top