సినీ దునియా  రేటింగ్ : 4/5
దర్శకత్వం : శ్రీ ప్రియ
నిర్మాత డి. సురేష్ బాబు – రాజ్ కుమార్ సేతుపతి
సంగీతం : ఎస్. శరత్
నటీనటులు : వెంకటేష్, మీనా, కృతిక..
ఎప్పటికప్పుడు కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించే కథానాయకుడు విక్టరీ వెంకటేష్. ఆయన హీరోగా చేసిన మరో ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మీనా, కృతిక, బేబీ ఎస్తర్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ ప్రియ దర్శకత్వం వహించిన ఈ సినిమాని డి. సురేష్ బాబు – రాజ్ కుమార్ సేతుపతి కలిసి నిర్మించారు. 
కథ :
కథ పచ్చని పొలాల మధ్య ఉన్న రాజవరం అనే ఊరిలో మొదలవుతుంది. ఆ ఊరిలో జ్యోతి కేబుల్ నెట్వర్క్స్ పెట్టుకున్న రాంబాబు(వెంకటేష్) తన కుటుంబ సభ్యులైన మీనా(జ్యోతి),అంజు (కృతిక), అను (బేబీ ఎస్తర్) హ్యాపీగా జీవిస్తుంటాడు. రాంబాబు చాలా నిజాయితీ పరుడు. అదే ఊరిలో బాగా లంచాలకు మరిగిన వీరభద్రం(రవి కాలే)కి రాంబాబుకి అస్సలు పడదు.
ఇదిలా ఉండగా.. ఒకరోజు ఐజి గీత ప్రభాకర్(నదియా) కుమారుడు వరుణ్ కనపడకుండా పోతాడు. వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుంటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏమన్నా సంబంధం ఉందా? లేక వీరభద్రం కావాలనే ఇరికించాడా? చివరికి రాంబాబు ఫ్యామిలీ ఆ కేసు నుంచి బయటపడ్డారా? లేదా అన్నది మీరు వెండితెరపైనే చూడాలి..
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మరియు సినిమాలో ఉన్న ది బెస్ట్ అంటే అది సినిమా సెకండాఫ్ లో వచ్చే థ్రిల్లింగ్ ఎపిసోడ్స్. ఆ థ్రిల్లింగ్ మోమెంట్స్ థియేటర్స్ లో సినిమా చూసే ప్రతి ఒక్కరి చేత వావ్ సూపర్బ్ అనిపిస్తాయి. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని జోడించి చూపించడం ఇదే తొలిసారి కావడం వలన ఆడియన్స్ థ్రిల్ కి ఫీలవుతారు. సెకండాఫ్ మొత్తం చాలా గ్రిప్పింగ్ గా అందరూ సీట్లో నుంచి కదలకుండా నెక్స్ట్ ఏం జరుగుతుందా అని చూసేలా ఉంటుంది.
ఇక చెప్పుకోవాల్సింది ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపైన నడిపించిన వెంకటేష్ గురించి.. వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించడం కొత్తేమీ కాదు, కానీ ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాలో చేయడం మాత్రం ఇదే తొలిసారి. రాంబాబు పాత్రలో అద్భుతమైన నటనని కనబరిచాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాత్రకీ వెంకీనే బెస్ట్ అనేలా అతని నటన ఉంటుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించిన మీనా వెంకటేష్ కి భార్య పాత్రలో చక్కగా సరిపోయింది. తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఎప్పటిలానే వెంకీ – మీనాల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అలాగే ఈ సినిమాతో పరిచయమైన కృతిక, బేబీ ఎస్తర్ లు తమ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించేలా నటనని కనబరిచారు.
అలాగే స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నదియా చాలా బాగా నటించింది. ముఖ్యంగా ఒక తల్లి తన కనపడని సమయంలో ఉండే ఆవేదనని, మరో పక్క తన కొడుకు గురించి తెలుసుకోవాలనే సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా తను పలికించిన హావ భావాలు సింప్లీ సూపర్బ్. నెగటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవి కాలే మంచి నటనని కనబరిచాడు. ఫస్ట్ హాఫ్ లో వెంకీ – సప్తగిరి మధ్య వచ్చే సన్నివేశాలు, అలాగే కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. నరేష్, చైతన్య కృష్ణ, సమీర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు. సినిమాలో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి.
మైనస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ లో చెప్పుకోవాల్సింది అంటే.. సినిమా నిడివి160 నిముషాలు ఉండటం 
తీర్పు :
విక్టరీ వెంకటేష్ నటించిన ‘దృశ్యం’ సినిమా వెంకటేష్ కి మరో విక్టరీని అందజేసింది. ఇది మళయాళ సినిమాకి రీమేక్ అయినా సినిమా లో కంటెంట్ ఉంది కావున తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. తెలుగు ఆడియన్స్ మునుపెన్నడూ చూడని విధంగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఉండే కొన్ని థ్రిల్లింగ్ మోమెంట్స్, ఎమోషనల్ సీన్స్, నటీనటుల పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్స్ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే అంశాలు, అలాగే రొటీన్ కి విభిన్నంగా కోరుకునే వారికి కావాల్సిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే ఆసక్తికరంగా సాగే సినిమా చూడాలనుకునే వారిలో ఉత్కంఠని కలిగించే అంశాలు ఈ సినిమాలో ఉండడం వలన మల్టీ ప్లెక్స్ నుండి సి సెంటర్ ప్రేక్షకుల వరకూ అందరూ ఈ సినిమాని చూసి థ్రిల్ ఫీల్ అవ్వవచ్చు.

0 comments:

Post a Comment

 
Top